క‌దులుతున్న సీబిఐ డొంకా, బ‌య‌ట‌కొస్తున్న తెలుగు నేత‌లు.

Read Time: 1 minutes

అవినీతిపై విచారించే బృంద‌మే అవినీతిలో కూరుక‌పోతే… దొంగ చేతికే ఇంటి తాళం ఇచ్చిన‌ట్లుగా ఉంటుంది. అవును అదే జ‌రిగింది. సిబిఐ అధికారుల‌కు ముడుపులు ముట్టిన కేసులో ఇద్ద‌రు పెద్ద అధికారులు అలోక్ వ‌ర్మ, అస్థానాలు ప‌ర‌స్ప‌రం చేసుకున్న విమ‌ర్శ‌ల‌పై పొలిటిక‌ల్ విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతుండ‌గా, కేసు ఇప్ప‌టికే హైకోర్టు ప‌రిధిలోకి వెళ్లింది. అయితే, ఇందులోనూ తెలుగు నాయ‌కుల పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తుండ‌టంతో…. తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపుతోంది.

ఇద్ద‌రు టాప్ అధికారుల ప‌ర‌స్ప‌ర విమర్శ‌లను ప‌క్క‌న‌పెడితే… స్పెష‌ల్ డైరెక్ట‌ర్ అస్థానా గుజ‌రాత్ అధికారి. మోడీ-షా ద్వ‌యానికి అత్యంత న‌మ్మ‌క‌మైన వ్య‌క్తి. కేంద్రంలో ఉండే నేతల చ‌ట్రంలో చిక్కుకొని ప‌నిచేసే సిబిఐకి, అస్థానా ద్వారా మోడీ-షా బృందం త‌మ రాజ‌కీయ వైరాన్ని న‌డిపే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు విమర్శ‌లు వ‌స్తున్నాయి. అప్ప‌టికే డైరెక్ట‌ర్ అలోక్ వ‌ర్మ అస్థానా ను వ్య‌తిరేకించ‌టం, అస్థానా ఇందుకు ప్ర‌తీకారంగా… ముడుపుల కేసులో పేర్లు వ‌చ్చేలా చూశార‌న్న‌ది ఆరోప‌ణ‌. అయితే, ఇందులో కీల‌కంగా ఉన్న మాంసం వ్యాపారి మెయిన్ ఖురేషీకి సంబందించిన కేసు నుండి బ‌య‌ట‌ప‌డేసేందుకు సానా స‌తీష్ బాబు సిబిఐ అధికారుల‌కు ముడుపులు చెల్లించార‌న్న‌ది ఆరోప‌ణ‌. ఇందులో స‌తీష్ బాబు వెంట కాంగ్రెస్ నేత ష‌బ్బీర్ అలీ ఉన్నార‌ని, కేసులో టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్ కూడా సిబిఐ డైరెక్ట‌ర్ తో మాట్లాడారు అంటూ స‌తీష్ త‌న వాంగ్మూలంలో చెప్పారు. ఇప్ప‌టికే సీఎం ర‌మేష్ పై ఐటీదాడులు జ‌రిగాయి.

సో… ఎక్క‌డో తీగ‌లాగితే, ఇక్క‌డ సీఎంర‌మేష్, ష‌బ్బీర్ అలీ పాత్ర‌లు బ‌య‌ట‌ప‌డుతుండ‌టం సంచ‌ల‌నంగా మారుతోంది. ఎన్నిక‌ల వేళ ప్ర‌త్య‌ర్ధుల‌కు ప్ర‌చార అస్త్రాలుగా మారుతున్నాయి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*