సిబిఐ ముడుపుల రచ్చ‌లో కొత్త కోణం, మోడీ మాస్ట‌ర్ ప్లాన్.

Read Time: 0 minutes

రాఫెల్ స్కాం ప్రధాని మోడీ మెడ‌కు చుట్టుకుంటున్న ద‌శ‌లో బ‌య‌ట‌కు వ‌చ్చిన సిబిఐలో అవినీతి అధికారుల అంశాన్ని మోడీ తెలివిగా ఉప‌యోగించుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. రాఫెల్ స్కాంపై దర్యాప్తు చేస్తున్న అధికారిని మోడీ ఈ నింద‌మోపి సాగ‌నంపారు అంటోంది ది వైర్.

మోడీ సర్కార్ సీబీఐ చీఫ్ ఆలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాలను సెలవుపై పంపించింది. కేంద్ర ప్రభుత్వం అర్థరాత్రి హఠాత్తుగా ఇద్దరినీ కాదని నాగేశ్వరరావుని సీబీఐ చీఫ్ గా నియమించడం వెనుక బలమైన కారణమే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆలోక్ వర్మ వివాదాస్పద రాఫెల్ జెట్ ఫైటర్ల కొనుగోలు కుంభకోణానికి సంబంధించిన పత్రాలను తనకు అందజేయాల్సిందిగా కోరినట్టు సమాచారం. అసలే రాఫెల్ స్కాం ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న కేంద్రం ఆ సెగను తప్పించుకొనేందుకు ఆలోక్ వర్మని తప్పించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ‘ది వైర్‘ కథనం ప్రకారం గత వారం ఆలోక్ వర్మ దసాల్ట్ ఏవియేషన్ నుంచి 36 రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ ల కొనుగోలుకు మోడీ ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై ప్రాథమిక దర్యాప్తునకు సిద్ధమయ్యారు.

ముందు నిర్ణయించిన ప్రకారం 18 ఫైటర్ జెట్లు కొనుగోలు చేసి మిగతా 108 భారత్ లో తయారు చేయాల్సి ఉండగా మోడీ 36 విమానాలు కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఎలాంటి చట్టపరమైన అనుమతులు లేకుండా ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకోవడాన్ని ప్రశ్నిస్తూ బీజేపీ మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సీబీఐకి క్రిమినల్ ఫిర్యాదు చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది. దీనిని పరిశీలనకు చేపట్టిన వర్మ వారు ఫిర్యాదుతో సమర్పించిన పత్రాలన్నీ అధికారికమైనవేనని రక్షణ మంత్రిత్వశాఖ ధృవీకరణ పొందారు.

రాఫెల్ డీల్ కి సంబంధించిన కొన్ని కీలక పత్రాలు అందజేయాల్సిందిగా రక్షణ శాఖను వర్మ కోరినట్టు ది వైర్ తన కథనంలో తెలిపింది. వర్మ దూకుడు ప్రధానమంత్రికి, ఆయన ప్రభుత్వానికి ప్రమాదకరంగా మారతాయని ప్రధాని సన్నిహితుడు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హెచ్చరించారు. దీంతో ఆలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగించినట్టు తెలుస్తోంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*