సీఎంగా ఎన్టీఆర్ పై దాడి, అప్పుడేం జరిగిందంటే….

Read Time: 1 minutes

9 జనవరి 1984.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా ఆ రోజుకి  సంవత్సరం గడిచింది . NT రామారావుగారు దానిని గ్రాండ్ గా సెలెబ్రేట్ చెయ్యాలని భావించారు. ఆయన ఆలోచనలకు తగ్గట్లు గానే హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ముందు విప్ వరుసల్లో పెద్ద నాయకులు, మంత్రులు ఆశీనులయ్యారు. అన్నిటికన్నా ముందు వరసలో గవర్నర్, రామారావు గారు, నాదెండ్ల భాస్కర రావు గారు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఎదురుగా ఉన్న స్టేజీ మీద కళాకారులు నృత్యాలు చేస్తున్నారు. ఇంతలో సడెన్ గా “ఇందిరాగాంధీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్” అంటూ అరుపులు వినపడ్డాయి. అందరు తలతిప్పి చూసే లోగానే చిన్నపాటి కత్తితో ఎన్టీఆర్ మీద దాడి చేసాడు. అందరు అతన్ని పట్టుకునే లోపే ఎన్టీఆర్ బొటన వేలుకి గాయం అయింది. ఎన్టీఆర్ అదేమీ లెక్క చెయ్యకుండా స్టేజీ మీదకు వెళ్లి కళాకారులను అభినందించి, “కాంగ్రెస్ వాళ్ళు నన్ను చంపాలని చూసారు, దేముడు కాపాడాడు” అని ఒక ప్రకటన ఇచ్చి తిన్నగా ఇంటికి వెళ్లి, చేతికి చిన్న నిమ్మకాయ ముక్క ఒకటి కట్టుకున్నారు (అక్కడున్న పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేదు, హాస్పిటల్ కి వెళ్ళలేదు). తర్వాత నాదెండ్ల భాస్కరరావు గారి బలవంతం మీద నిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ కి చూపించుకొన్నారు.

ఆ దాడి చేసిన వ్యక్తి పేరు మల్లెల బాబ్జి. అప్పటికే నాదెండ్ల, కొత్తగా పార్టీలోకి వచ్చిన చంద్రబాబు మధ్య విభేదాలు ఉండటంతో, నిందితుడుది కూడా గుంటూరు జిల్లా అవ్వటంతో ఈ హత్యాయత్నం వెనక నాదెండ్ల హస్తం కూడా ఉందని కేసు పెట్టాలని చంద్రబాబు ప్రయత్నించారు. కానీ, పార్టీలో కొంతమంది పెద్దలు దీనికి అంగీకరించక పోవటంతో కేవలం మల్లెల బాబ్జి మీద కేసు పెట్టారు. కోర్టులో ఇది చిన్న విషయమని, నిందితుడ్ని క్షమించి వదిలెయ్యమని ఎన్టీఆర్ కోరారు.

కానీ, కొన్నాళ్ళకు బయటకు వచ్చిందేమిటంటే, ఇది చంద్రబాబు, అప్పట్లో అక్కడ ఇంటిలిజెన్స్ ఛీఫ్ అధికారిగా పని చేస్తున్న విజయరామరావు ( ఈయన్ని 1986 లో ఆర్టీసీ చైర్మన్ గా నియమించారు. తర్వాత సిబిఐ లో ఏ అనుభవం లేకపోయినా 1993 లో సిబిఐ డైరెక్టర్ గా కూడా ప్రమోట్ అయ్యారు!) కలిసి ఆడిన నాటకమని, మల్లెల బాబ్జికి ఇలా చేస్తే 3 లక్షల రూపాయల నగదు, ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి అతనితో ఈ నాటకం ఆడించారని అనే వార్తలు వచ్చాయి. కేసు నుంచి బయటపడ్డ బాబ్జి వత్తిడి తేవటంతో అతన్ని తెలుగుదేశంకి చెందిన గుంటూరు జిల్లా పరిషత్ లో (చైర్మన్ సక్కుర్తి రామయ్య)  తోటమాలిగా ఉద్యోగంలో పెట్టారు. కొన్నాళ్ల తర్వాత ఆ ఉద్యోగం నుంచి తొలగించారు. ఉద్యోగం కోల్పోయిన అతను తిరిగి మొదట కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చంద్రబాబు తనకు 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చెయ్యటం మొదలుపెట్టటంతో అతన్ని తన్నించినట్లు వార్తలు వచ్చాయి. కొన్నాళ్ల తర్వాత అతను విజయవాడ లాడ్జీలో నవంబర్ 30, 1987 న ఆత్మహత్య చేసుకోవటంతో ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది.

అప్పుడు శ్రీ వంగవీటి మోహనరంగా ఆధ్వర్యంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు దీనిమీద విచారణ జరిపించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి చెయ్యటంతో జస్టిస్ శ్రీరాములు నేతృత్వంలో విచారణ కమిటీ వేశారు. ఆ విచారణలో మల్లెల బాబ్జి గదిలో దొరికిన రెండు లేఖల ప్రకారం, ఇది అప్పటి అధికార పార్టీ ముందస్తు ప్రణాళికతో సంచలనం కోసం చేయించిన నాటకం అని, ఒప్పందం ప్రకారం ఇవ్వవలసిన మూడు లక్షల బదులు 30,000 రూపాయలు ఇచ్చి మోసం చేశారు అని తేలింది అని శ్రీరాములు కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఈ లేఖలను జస్టిస్ శ్రీరాములు జూన్ 11, 1988 న బయట పెట్టారు. వాటిని కేసులో భాగంగా విజయవాడ కోర్టుకి సమర్పించారు.

కానీ, అప్పటి విజయవాడ మేజిస్ట్రేట్ బెనర్జీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆ లేఖలు బయటకు రాకుండా ఆపేసారు. శ్రీరాములు రిపోర్ట్ మీద పూర్తి చర్చకు వస్తే అది చంద్రబాబు, విజయరామారావుల మెడకు చుట్టుకొంటుందని భావించి ఆ రిపోర్టు మీద ఏ రోజు చర్చ చెయ్యలేదు. ఇక్కడ మరో ఆసక్తికర ట్విస్ట్ ఏమిటంటే, జస్టిస్ శ్రీరాములు కొన్నాళ్ల తర్వాత చంద్రబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

నోట్— ఇది నాదేండ్ల పుస‌క్తం నుండి సేక‌రించబ‌డింది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*