వ‌రుస పండుగ‌లు, ఆశావాహుల‌కు త‌డిసి మోపేడ‌వుతున్న ఖ‌ర్చులు

Read Time: 0 minutes

పండ‌గ‌ల వేళ, ఎన్నిక‌లు రావ‌టంతో… ఆశావాహులు, అభ్య‌ర్థులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. మామ‌లుగా అయితే ఎన్నిక‌ల ఖ‌ర్చులే ఎక్క‌వుంటాయి. ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌చ్చిన నాటి నుండి, పోలింగ్ ముగిసేవ‌ర‌కు ఉండే ఖ‌ర్చులు అంతా ఇంతా కావు. కోట్లలో ఖ‌ర్చుచేయ‌నిదే… గెలుపు సాధ్యంకాదు అనేది బ‌హిరంగ ర‌హ‌స్యం.

కానీ,వ‌రుస‌గా వ‌స్తున్న పండుగ‌లు ఎన్నిక‌ల ఖ‌ర్చును మ‌రింత పెంచేస్తున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. దేవీ న‌వ‌రాత్రుల సీజ‌న్ కావ‌టంతో… ప్ర‌తి ఊరు, గ‌ల్లీ యూత్ అంతా లీడ‌ర్ల ద‌గ్గ‌ర క్యూ క‌ట్టార‌ట‌. ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేకుండా చందాల‌కు నేత‌ల‌ను సంప్ర‌దిస్తున్నారు. ఈటైంలో కాదు, కుద‌ర‌దు, త‌ర్వాత చూద్ధాంలే అని అన‌లేరు. అలాగ‌ని అంద‌రికీ ఇవ్వ‌గల‌రా… అంటే ఇవ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. దీనికి తోడు, గ్రామాల్లో బ‌తుక‌మ్మ ఆడే మ‌హిళల సౌక‌ర్యాల కోసం ఏర్పాట్లు, ద‌స‌రా ఖ‌ర్చులు, ద‌స‌రా మాముల్లు… ఇలా ఈసారి ఎక్కువే ఇవ్వ‌క త‌ప్ప‌టం లేద‌ని నేత‌లు వాపోతున్నారు. పైగా మ‌హిళ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకోవ‌డానికి చీరెలు, సారెలు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అందులోనూ మ‌హిళ‌ల‌కు ఎంతో ఇష్ట‌మైన బ‌తుక‌మ్మ పండుగ‌. దీంతో నేతలు, నేత‌ల భార్య‌లు మ‌హిళ‌ల‌కు సారే, బొట్టు పేరుతో క్యూ క‌డుతున్నారు. ఎన్నిక‌ల‌కు ఇంకా దాదాపు 2నెల‌ల స‌మ‌యం ఉంది. దీంతో నేతలంతా… టెన్ష‌న్ ప‌డిపోతున్నారు.

పోనీ, ఖ‌ర్చంటే పెట్టారు కానీ గెలుపు….?  గెలుపు వ‌ర‌కు ఎందుకు, ప్ర‌తిపార్టీలోనూ ఆశావాహులు ఎక్కువే ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీలో టికెట్ ప్ర‌క‌టించాక కూడా… ఇంకా అస‌మ్మ‌తి నేత‌లు ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఇంత‌పెద్ద మొత్తంలో ఖ‌ర్చు చేశాక‌, తీరా టికెట్ త‌మ‌కు రాకుండా… అవ‌త‌లివారికి వ‌స్తే ప‌రిస్థితి ఏంటీ… గాల్లో దీపంలా త‌యారైంది త‌మ ప‌రిస్థితి అంటూ నిట్టూర్చుతున్నారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*