ఎందుకంత తాప‌త్రేయం… కోదండా..?

Read Time: 0 minutes

కేసీఆర్ ఓట‌మే ల‌క్ష్యంగా పుట్టిన పార్టీకి,  సీట్ల‌తో ఏం ప‌ని…?  సొంతంగా పార్టీ నిర్మాణం లేదు, ఇంకా గుర్తేదో ఖ‌రారు కాలేదు, ఏ ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలో నిండా… మండ‌ల‌స్థాయి కార్య‌క‌ర్త‌లు లేరు, కానీ 30,20 సీట్లు అంటూ కూట‌మిలో కాలాయాప‌న ఎందుకు అన్న‌ది ఇప్పుడు పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో నానుతున్న ప్ర‌శ్న‌.

ఓ రాజ‌కీయ పార్టీగా ఎక్కువ సీట్లు కావాల‌ని ఉన్నా, టీజెఎస్ లో కోదండరాం మిన‌హా పెద్ద నేత‌లు ఎవ‌రూ లేరు. ఆయ‌న్ను ఒక్క‌న్ని మిన‌హాయిస్తే… ఆపార్టీలో క‌నీసం జ‌నం గుర్తుపట్టే నాయ‌కుడు లేడు, కానీ ఎక్కువ సీట్లు కావాలంటూ మెలిక‌. నిజ‌మే… తెలంగాణ ఉద్య‌మంలో కీ రోల్ పోషించి, పెద్ద‌న్న‌గా ముందున్నాడు. దాన్ని ఎవ‌రూ కాద‌న‌లేరు. కానీ ఒక‌టి రెండు సీట్లు మిన‌హా గెల‌వ‌లేని వారికి ఎందుకు ఎక్క‌వ ఇచ్చి, రిజ‌ల్ట్స్ త‌ర్వాత చేతులు కాల్చుకోవ‌టం అన్న‌ది కాంగ్రెస్ స‌హా కూట‌మి నేత‌ల వాద‌న‌గా ఉంది. పైగా కోదండరాం పోటీ చేస్తాడో లేదో కూడా తేల‌టం లేదు.

ఇలాంటి ద‌శ‌లో కూట‌మిలో గెలిచే పార్టీల‌కు వెన్నుద‌న్నుగా ఉండి, గెలిచాక‌… స‌ముచిత స్థానం కోరితే బాగుంటుంది కానీ, రోజుకో ష‌ర‌తుతో, ఎందుకు కాలాయ‌ప‌న అన్న‌ది అంద‌రినీ ఆలోచింప‌చేస్తుంది. పైగా… ఎక్కువ స్థానాలు ఇచ్చినా, కూట‌మిలో టీడీపీ, కాంగ్రెస్, సిపిఐల‌కు ఉన్న ఎన్నిక‌ల గుర్తు ప్ర‌జ‌లంద‌రికీ సుప‌రిచిత‌మే. కానీ టీజెఎస్ గుర్తు అంటే… ఎవ‌రూ గుర్తుపట్ట‌రు. ఇంకా గుర్తే రాలేదు. కొత్త గుర్తుతో ఎన్నిక‌లకు వెళ్తే… ఓట్లు చీలే ప్ర‌మాదం ఉంటుంది. అది ఎవ్వ‌రికీ మంచిది కాదంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.  మ‌రోవైపు… కాంగ్రెస్ గుర్తుపై కోదండ‌రాం పార్టీ నేత‌లు పోటీచేయ‌టం ఉత్త‌మ‌మ‌ని, త‌ద్వారా ఓట్లు చీల‌కుండా… కూట‌మి ల‌క్ష్యం ప‌రిపూర్ణ‌మ‌య్యే అవ‌కాశాలుంటాయంటున్నారు మేధావులు. ఇలాంటివి చివ‌ర‌కు కేసీఆర్ కే మేలు చేస్తాయ‌ని, చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకోవ‌టంతో లాభం ఉండ‌ద‌ని, ఇప్ప‌టికైనా కోదండ‌రాం పున‌రాలోచించుకోవాలని సూచిస్తున్నారు.

ఒక‌టి రెండు సీట్లకు మించి బ‌లం లేని కోదండరాం పార్టీకి… పైగా ఎన్నిక‌ల ఖ‌ర్చు భ‌రించ‌లేని స్థితిలో ఉన్న పార్టీకి అంత‌కు మించి సీట్లు ఇవ్వ‌టం కూడా మంచిది కాద‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*