
ఇన్నాళ్లు… పార్టీలో ఉంటారో పోతారో తెలియదు. ఎప్పుడు ఎవరిని పొగుడుతారో… ఎవరిపై అటాక్ చేస్తారో ఊహించలేము. పార్టీ అద్యక్షుడు దగ్గర నుండి, ఏ సీనీయర్ నేతనైనా… పొగడటంలోనూ, విమర్శించటంలోనూ కోమటిరెడ్డి బ్రదర్స్ ది డిఫరెంట్ అటాకింగ్. కానీ వీరి బలంపై నమ్మకముంచింది కాంగ్రెస్ అధిష్టానం.
బీజేపిలోకి వెళ్తారన్న ప్రచారం ఓ పక్క, ఇంట్లో ఒకరికే సీటు అని ఇంకోపక్క అనేక రకాల ప్రచారాలను తట్టుకొని… ఔరా అనిపించారు కోమటిరెడ్డి బ్రదర్స్. నల్గొండ నుండి సీటు దక్కించుకున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సోదరుడికి కూడా మునుగోడు సీటు దక్కింది. అక్కడ నుండి సీనీయర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు స్రవంతి చివరి వరకు ప్రయత్నించినా, ఆమెను కాదని… గెలుపు గుర్రాల వేటలో ఉన్న రాజగోపాల్ రెడ్డివైపే మొగ్గు చూపింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక తన అనుచరుడైన… చిరుమర్తి లింగయ్య టికెట్ విషయంలో చివరి వరకు సస్పెన్స్ కొనసాగింది. ఆ టికెట్ ను ఇంటిపార్టీ నుండి చెఱుకు సుధాకర్ భార్య పోటీ చేస్తారని కుంతియా కూడా చెప్పకనే చెప్పేశారు. దీంతో… కోమటిరెడ్డి వర్గానికి ఝలక్ అన్న ప్రచారం మీడియాలో వైరల్ అయింది. కానీ ఈసారి కోమటిరెడ్డి బహిరంగంగా ఎవరినీ విమర్శించలేదు. పైగా… టికెట్ తమకే వస్తుందని, 100కు 100శాతం లింగయ్యే పోటీచేస్తాడని తేల్చిపారేశారు. పైగా ఆయనకు టికెట్ ఇవ్వకపోతే… తామేవరం పోటీచేయమని అల్టీమేటమ్ జారీ చేశారంటే… లింగయ్యకు టికెట్ ఓకే అయిందన్న పక్కా సమాచారం ఉండే ఉంటుందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.
పైగా.. మొదటి జాబితాలోనే, అత్యధికంగా మొత్తం 3 స్థానాలను సాధించుకోగలిగారు కోమటిరెడ్డి బ్రదర్స్. ఇక… తుంగతుర్తిలో అద్దంకి దయాకర్ కోసం కూడా వీరు గట్టిగానే ప్రయత్నించినా, రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయుడు.. డా.రవికి ఆ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే, ఆ టికెట్ ఇంటిపార్టీకి కూడా కేటాయించే ఆలోచన ఉందని తెలుస్తోంది. మొత్తంగా… జానారెడ్డి లాంటి సీనీయర్ నేతలకు సాధ్యంకాని పనిని… కోమటిరెడ్డి బ్రదర్స్ చేసి చూపించారంటున్నారు ఆయన వర్గం నేతలు.
Leave a Reply