అవును… క‌న్నీళ్ల‌కు ఓట్లు రాలును.

Read Time: 0 minutes

అవును. నిజ‌మే… క‌న్నీళ్ల‌కు ఓట్లు రాలుతాయి. ఎన్నో సార్లు ఈ ప్ర‌యోగం నిజ‌మైంది. నిజ‌మ‌వుతూనే ఉంటుంది. అందుకు మ‌రో రుజువు ద‌గ్గ‌ర్లోనే ఉంది. క‌న్నీళ్ల‌కు ఎలా ఓట్లు రాలుతాయో… త‌ల‌పండిన రాజ‌కీయ మేధావుల‌కు, నేత‌ల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాలా…? అందుకే కాదా, చంద్ర‌బాబు…. నంద‌మూరి హ‌రికృష్ణ కూతురును రంగంలోకి దింపారు.

కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంపై తెలంగాణ ఉద్య‌మం నుండే ఓ చ‌లోక్తి ప్రాచుర్యంలో ఉంది. కూక‌ట్ ప‌ల్లి అంటే… తెలంగాణ‌లో ఉన్న ఆంద్రా భూభాగం అని. అది… ఎంత‌వ‌ర‌కు నిజ‌మో అంద‌రికీ తెలుసు. తాజాగా, కూట‌మి పొత్తుల్లో భాగంగా కూక‌ట్ ప‌ల్లి నుండి టీడీపీ పోటీచేయ‌బోతుంది. కూట‌మి అనుకున్న‌ప్ప‌టి నుండే… ఆ సీటు టీడీపీకే అని అంద‌రికీ తెలుసు. పైగా అక్క‌డ టిడిపీకి మంచి ప‌ట్టుంది. ఆంద్రా ప్రాంతం వారు ఎక్కువ‌గా ఉండ‌టం, పైగా అక్క‌డ గెలుపోట‌ముల‌ను ఒ బ‌ల‌మైన సామాజిక‌వర్గ‌మే నిర్ణ‌యిస్తుంది. దీంతో… స్థానికంగా పార్టీనే అంటిపెట్టుకొని ఉన్న మండ వెంక‌టేశ్వర్రావుతో పాటు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి టికెట్ రేసులో ఉన్నారు. పెద్దిరెడ్డికి టికెట్ ఖాయమ‌ని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా… సెంటిమెంట్ కార్డును బ‌య‌ట‌కు తీశారు చంద్ర‌బాబు.

మొద‌ట ఎన్టీఆర్ ను, క‌ళ్యాణ్ రామ్ ల‌ను సంప్ర‌దించినా, వారు నో అన‌టంతో… హ‌రికృష్ణ కూతురు సుహ‌సిని వైపు మొగ్గుచూపారు. నిజానికి నేను ఎన్టీ రామారావు కుటుంబాన్ని పూర్తిగా ప‌క్క‌న‌పెట్టేశార‌న్న వాతావ‌ర‌ణాన్ని ఆంద్రాలో చెరిపేసుకునే ప్ర‌య‌త్నం ఒక‌టైతే, నంద‌మూరి వంశ‌మైతే… కూక‌ట్ ప‌ల్లిలో గ‌న్ షాట్ విన్నింగ్ సీటు. పైగా… ఇటీవ‌ల హ‌రికృష్ణ మ‌ర‌ణం త‌ర్వాత వారి కుటుంబం ప‌ట్ల ఎంతో సానుభూతి ఉంది. అందుకే చంద్ర‌బాబు సుహ‌సిని వైపు మొగ్గుచూపారు. మొత్తంగా.. క‌న్నీళ్ల‌కు ఓట్లు రాలుతాయ‌ని చంద్ర‌బాబు మ‌రోసారి టికెట్ ఇచ్చారు. ఇప్ప‌టికే… ఈ క‌న్నీళ్ల సెంటిమెంట్ ను ఏపీలో అనేక‌సార్లు రుజువుచేశారు చంద్ర‌బాబు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*